: 2014లో ఐఎస్ఐఎస్ ఆస్తి 5,600 కోట్లు...మరి ఇప్పుడు?
2014లో ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ మొత్తం ఆస్తి 5,600 కోట్ల రూపాయలని ర్యాండ్ కార్పొరేషన్ తెలిపింది. ఆ తరువాత కిడ్నాపులు, దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలు, తమ అధీనంలో ఉన్న భూభాగంలోని ప్రజలపై పన్నులు, తాము ఆక్రమించుకున్న చమురు సంస్థల ద్వారా సంక్రమించిన ఆదాయంతో ఐఎస్ఐఎస్ అనతికాలంలోనే ప్రపంచానికి సవాలు విసిరే స్థాయికి చేరింది. ఈ డబ్బుతోనే ఫ్రాన్స్, అమెరికాపై దాడులు సహా పలు దేశాల్లో దాడులకు ఐఎస్ఐఎస్ పథకరచన చేసింది. దీంతో ఆగ్రహించిన పలు దేశాలు ఏకమై ఐఎస్ఐఎస్ పై దాడులు ప్రారంభించాయి. అమెరికా చేసిన బాంబుదాడుల్లో ఐఎస్ కు చెందినా ధనాగారాలు కొన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే సమయంలో టెర్రరిస్టులపై పెరిగిన దాడులను ఎదుర్కోవడానికి ఆయుధాల కొనుగోలుకు, హతమైన ఉగ్రవాదుల స్థానంలో కొత్తవారిని రిక్రూట్ చేసుకునేందుకు విచ్చలవిడిగా ఖర్చుచేయడంతో ఐఎస్ఐఎస్ సమీకరించిన నిధులు తరిగిపోతున్నాయి. ఇదే సమయంలో చమురు కర్మాగారాలు, మూడు భారీ స్టోరేజీ ట్యాంకులు, భారీ పైపులైన్లు కలిగిన ఉత్తర సిరియాలోని అల్ హాల్ పట్టణాన్ని సిరియా సేనలు, తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వీరి ధాటికి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, చమురు వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులు పిక్కబలం చూపించారని సమాచారం. ఈ పట్టణంలోని చమురు సంస్థల నుంచి చేసిన వ్యాపారంతోనే ఖర్చులకు సరిపడా సంపాదనను ఐఎస్ఐఎస్ వెనకేసింది. ఐఎస్ఐఎస్ ప్రతి ఏటా బ్యాలెన్స్ షీట్ చూడదు. అందినంతమేర ఖర్చుపెట్టడమే తప్ప జమా ఖర్చుల వివరాలు, లెక్కలు చూడడం జరగదు. దీంతో ప్రస్తుతం ఐఎస్ఐఎస్ వద్ద ఏమేర నిధులు ఉన్నాయనేది అంచనా వేయడం కష్టంగా ఉందని తెలుస్తోంది.