: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వాడితే క్యాన్సర్... నమూనాలను పరీక్షలకు పంపిన మహారాష్ట్ర సర్కారు
సుదీర్ఘ కాలంగా జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్న పౌడర్ వాడటం వల్ల 62 ఏళ్ల మహిళకు క్యాన్సర్ సోకి మరణించిందని తీర్పిస్తూ, అమెరికా పరిధిలోని మిస్సోరీ కోర్టు సుమారు రూ. 485 కోట్లు నష్ట పరిహారంగా ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కదిలింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ శాంపిల్స్ సేకరించిన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వాటిని తదుపరి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. ఈ విషయాన్ని మహా ఎఫ్డీఏ కమిషనర్ హర్షదీప్ కాంబ్లేయ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా శాంపిల్స్ ను ప్రయోగశాలకు పంపినట్టు వివరించారు. కాగా, ఇండియాలో పలు శిశు సంరక్షణ ఉత్పత్తులను జాన్సన్ అండ్ జాన్సన్ మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.