: నివాస ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!


నివాస ప్రాంతాల మధ్య ఉన్న కోచింగ్ సెంటర్లు ఆ ప్రాంతాల్లో న్యూసెన్స్ గా తయారయ్యాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు, వాటిని వెంటనే వాణిజ్య ప్రాంతాలు లేదా విద్యా కేంద్రాలున్న ప్రాంతాలకు తరలించాలని సూచించింది. రెసిడెన్షియల్ కాలనీల్లో ట్యుటోరియల్స్ నిర్వహించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం నిషేధించగా, ఆల్ రాజస్థాన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో నిరాశే మిగలగా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ లలిత్ లు, ట్యుటోరియల్స్ నిర్వాహకులకు రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించారు. "ఉదయం, సాయంత్రం యువకులు బైకులపై వస్తుంటారు. నివాస ప్రాంతాల్లో ఉన్న మహిళలు, వృద్ధులకు ఇది ఇబ్బందికరం. వాణిజ్య ప్రాంతాలకు కోచింగ్ సెంటర్లు తరలాల్సిందే" అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అంతకుముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధించి, తమ క్లయింట్ల వాదన వినాలని ఆయన కోరినప్పటికీ, ధర్మాసనం అంగీకరించలేదు.

  • Loading...

More Telugu News