: హిందూపురం త్వరలో జిల్లా కాబోతోందట!... అసెంబ్లీ లాబీల్లో బాలయ్య వ్యాఖ్య
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 13 జిల్లాలే మిగిలాయి. అయితే త్వరలో ఈ జిల్లాల సంఖ్య 14కు చేరనుందట. కొత్త జిల్లా పేరేమిటి? ఎక్కడ నుంచి, ఏ జిల్లా నుంచి ప్రత్యేక జిల్లా రాబోతోంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మాత్రం... టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్లాల్సిందే. కరవు జిల్లా అనంతపురం జిల్లాలోని హిందూపురం ప్రాంతాన్ని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కసరత్తు శరవేగంగా జరుగుతున్నట్లు స్వయంగా బాలయ్య... నిన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో చెప్పారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడిన సందర్భంగా బాలయ్య... హిందూపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. మొన్న అంగరంగవైభవంగా నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలను ఇకపై రెండేళ్లకోమారు నిర్వహించనున్నట్లు కూడా బాలయ్య చెప్పారు. లేపాక్షిని అంతర్జాతీయ చారిత్రక సంపదగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ రాసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.