: అన్ని పార్టీలు జట్టు కట్టినా పని కాలేదు!...అచ్చంపేటలో నాలుగు వార్డులను గెలిచిన టీఆర్ఎస్
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు... అన్ని పార్టీలు ఒక్కదరికి చేరాయి. ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా చేతులు కలిపాయి. వామపక్షాలతో కలిసి ఆ రెండు పార్టీలు పాలమూరు జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడి, టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగాయి. అయితే మహా కూటమి పేరిట ఆ పార్టీలు అసుసరించిన వ్యూహం పెద్దగా ఫలితం ఇవ్వలేదు. నేటి ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో భాగంగా తొలి గంటలోనే టీఆర్ఎస్ నాలుగు వార్డులను గెలుచుకుంది. మొత్తం 20 వార్డులున్న అచ్చంపేట నగర పంచాయతీలో మరో ఏడు వార్డులు గెలిస్తే, టీఆర్ఎస్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అర్హత సాధిస్తుంది. కౌంటింగ్ సరళి చూస్తే... 11 స్థానాల కంటే కూడా ఇంకా ఎక్కువ స్థానాలనే టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.