: తెలంగాణ మున్సి‘పోల్స్’ ఫలితాలు నేడే!... వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో కాసేపట్లో కౌంటింగ్
కొత్త రాష్ట్రం తెలంగాణలో రెండో విడత జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇటీవల గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగరపాలక సంస్థ, పాలమూరు జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ (మునిసిపాలిటీ) పాలకవర్గాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్ కు సంబంధించిన నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 58 డివిజన్ల ఓట్ల లెక్కింపు కూడా అక్కడే జరగనుంది. ఇక ఖమ్మం కార్పొరేషన్ లోని 50 డివిజన్లకు జరిగిన ఓట్ల లెక్కింపు నగరంలోని పత్తి మార్కెట్ లో జరగనుంది. అచ్చంపేట నగర పంచాయతీకి చెందిన 20 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మండల రిసోర్స్ సెంటర్ లో జరగనుంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు మధ్యాహ్నంలోగా ముగియనుంది. మూడు చోట్లా అధికార టీఆర్ఎస్ పార్టీకే ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.