: నేను కూడా టీబీతో బాధపడ్డాను: అమితాబ్ బచ్చన్
2000లో తాను టీబీ (క్షయ రోగం) బారినపడ్డానని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తెలిపారు. దానికి ఏడాది పాటు చికిత్స తీసుకోవడంతో దాని నుంచి బయటపడ్డానని ఆయన వెల్లడించారు. త్వరలోనే భారత్ క్షయవ్యాధి రహిత భారతదేశంగా ఎదుగుతుందని ఆయన చెప్పారు. గతంలో టీబీ వ్యాధిపై అవగాహన ప్రచారానికి ఎందుకు అంగీకరించారంటూ చాలా మంది అడిగారని ఆయన చెప్పారు. తాను దానిపై అవగాహన కల్పించేందుకు నడుం బిగించడం వెనుక కారణం, తాను కూడా దాని బారినపడడమేనని ఆయన అన్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' చేస్తున్నప్పుడు చికిత్స తీసుకునే వాడినని అన్నారు. తనకు వెన్నెముకకు సంబంధించిన క్షయ సోకిందని ఆయన చెప్పారు. దాని కారణంగా కుదురుగా కూర్చోలేకపోయేవాడినని ఆయన తెలిపారు. దీంతో రోజుకు ఎనిమిది నుంచి పది పెయిన్ కిల్లర్స్ వాడేవాడినని ఆయన చెప్పారు. ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే...ఈ వ్యాధి బారినపడ్డవారు సురక్షితంగా బయటపడవచ్చనే ధైర్యం కలిగించేందుకేనని ఆయన అన్నారు. దీని బారి నుంచి సురక్షితంగా బయటపడడంతో తన మనవరాలు ఆరాథ్యతో హాయిగా ఆడుకోగలుగుతున్నానని ఆయన చెప్పారు. త్వరలోనే టీబీ రహిత దేశంగా భారత్ అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.