: ఏపీ ఉభయసభలు రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి రేపటికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ శాసనసభలో సరికొత్త సంప్రదాయం మొగ్గతొడిగింది. ప్రజాసమస్యల పరిష్కారం కోసమంటూ ప్రశ్నోత్తరాల తరువాత వాయిదా తీర్మానాలు అనే సరికొత్త అంశాన్ని పరిచయం చేశారు. దీంతో రెండోరోజు బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ నేత జగన్, టీడీపీ నేతల మధ్య ఎప్పట్లానే ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రవేశపెట్టారు. దీనిపై రేపు చర్చ చేపడదామంటూ శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం అదే బాటలో శాసనమండలి కూడా నడిచింది. ఉభయసభల్లో మహిళాదినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులుగా మహిళల సంరక్షణ, సాధికారతకు పాటుపడతామంటూ ప్రతిజ్ఞ చేయడం విశేషం.