: ‘మహిళలపై వ్యాఖ్య’లకు అసెంబ్లీలో వివరణ ఇచ్చిన బాలకృష్ణ... భావోద్వేగానికి గురైన వైనం


సినిమా ఆడియో వేడుకలో భాగంగా మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం వివరణ ఇచ్చారు. మూడు రోజుల క్రితం నారా రోహిత్ నటించిన ‘సావిత్రి’ ఆడియో వేడుక సందర్భంగా బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. నేషనల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం ప్రారంభమైన రెండో రోజు సమావేశాలకు హాజరైన సందర్భంగా బాలయ్య సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మహిళలను కించపరచాలనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని బాలయ్య పేర్కొన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యల్లో తప్పుంటే మన్నించాలని కూడా ఇదివరకే ప్రకటించానని తెలిపారు. అభిమాన జనసందోహం మధ్య సినిమా స్టైల్లో మాట్లాడానే తప్పించి ఏ ఒక్కరినీ నొప్పించే ఉద్దేశం తనకు లేదని బాలయ్య పేర్కొన్నారు. అయినా తన వ్యాఖ్యలకు అభిమానులు కేరింతలు కొట్టారన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్, ఆయన నటించిన చిత్రాలు, వాటిలో మహిళలకు దక్కిన ప్రాధాన్యం... తదితరాలను బాలయ్య ప్రస్తావించారు. తన గురించి తన చిత్రాల్లో నటించే మహిళా నటులకు బాగా తెలుసని కూడా ఆయన తెలిపారు. తన తండ్రి చిత్రాల్లోలాగే తన చిత్రాల్లోనూ మహిళలకు పెద్ద పీట వేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలు కూడా తన చిత్రాలను, మహిళల పట్ల తన వైఖరిని గుర్తుంచుకుంటాయని కూడా బాలయ్య పేర్కొన్నారు. తాను మాట్లాడుతున్న సందర్భంగా తన ప్రసంగానికి అడ్డు తగిలేందుకు యత్నించిన ఓ విపక్ష ఎమ్మెల్యేను బాలయ్య కసురుకున్నారు.

  • Loading...

More Telugu News