: జగన్ పై విరుచుకుపడ్డ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని!
తహశీల్దార్ వనజాక్షిపై దాడిని అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన వనజాక్షిపై ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న చింతమనేని దౌర్జన్యానికి దిగారని, మహిళ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చారని జగన్ ఆరోపించారు. జగన్ ప్రసంగం ముగిసేదాకా ఓపిగ్గా కూర్చున్న చింతమనేని ఆ వెంటనే స్పందించారు. వనజాక్షిపై దాడి ఘటనలో పోలీసు కేసు నమోదైందని తెలిపిన చింతమనేని, తాను మహిళా అధికారిని జట్టు పట్టి లాగినట్లుగా ఎక్కడా నమోదు కాలేదన్నారు. కేసు పెట్టిన వనజాక్షి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ విషయంలో తనపై నమోదైన కేసు దర్యాప్తులో ఉందని, దానిని చట్టపరంగానే ఎదుర్కొంటానని పేర్కొన్న చింతమనేని, తనపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆవేశానికి గురైన చింతమనేని... మహిళలను గౌరవపరిచే లక్షణం జగన్ లో ఏ కోశానా లేదని వ్యాఖ్యానించారు.