: ఫడ్నవీస్ తో భేటీలో చంద్రబాబు పేరును ప్రస్తావించిన కేసీఆర్!
గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించనున్న ఐదు ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఐదు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ మేరకు నిన్న మధ్యాహ్నానికే ముంబై చేరుకున్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. అప్పటికే అధికారులు రూపొందించిన ఒప్పంద పత్రాలపై వారు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... ఈ ఒప్పందాలతో 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం కానుందని పేర్కొన్నారు. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలయినన్ని ప్రాజెక్టులను నిర్మించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే ఏటా 2 నుంచి 4 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేరును ప్రస్తావించారు. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని ఏపీ సీఎం కూడా చెబుతూ ఉంటారని ఆయన చంద్రబాబును గుర్తు చేసుకున్నారు.