: షరపోవాకు తొలి దెబ్బ!... రష్యా భామతో ఒప్పందాలు రద్దు చేసుకున్న నైక్
డోపింగ్ లో అడ్డంగా బుక్కైన టెన్నిస్ బ్యూటీ క్వీన్ మారియా షరపోవాకు తొలి షాక్ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొన్న సందర్భంగా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డొనియంను వాడినట్లు తేలింది. ఈ వార్తలను లాస్ ఏంజెలిస్ వేదికగా షరపోవా కూడా అంగీకరించింది. అయితే తాను సదరు ఉత్ప్రేరకాన్ని వాడటం ఇదే మొదలు కాదని, చిన్నప్పటి నుంచి వాడుతున్నానని షరపోవా చెప్పింది. మొన్నటి వరకు సదరు ఉత్ప్రేరకంపై నిషేధం లేదని, తాజా నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలోనే అది చేరిందని ఈ రష్యా భామ చెప్పింది. తనకు మరో అవకాశం ఇవ్వాలని కూడా షరపోవా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యకు విజ్ఞప్తి చేసింది. అయితే ఈ వ్యవహారంపై క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘నైక్’ వేగంగా స్పందించింది. షరపోవాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆ సంస్థ కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేసింది. డోపింగ్ వార్తలు వాస్తవమే అంటూ షరపోవా ప్రకటించిన కొద్దిగంటల్లోనే నైక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.