: సీఐ కొండ... అవినీతి అనకొండ!


విశాఖపట్నం జిల్లా క్రైం బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్న కొండ.. పేరుకే కాదండోయ్, అవినీతిలోనూ అనకొండే. కేసుల పరిశోధనలో కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యతల్లో ఉన్న కొండ... డ్యూటీని పక్కనపెట్టేసి సెటిల్ మెంట్లకు తెర తీశాడు. పెరిగిన రియల్ భూం నేపథ్యంలో చాలా కాలం క్రితం నుంచే ప్రారంభించిన సెటిల్ మెంట్లతో కొండ భారీగానే కూడబెట్టాడు. సెటిల్ మెంట్ల పేరిట తనను ఆశ్రయిస్తున్న బాధితులకు దన్నుగా నిలుస్తున్న కొండ, అవతలి పార్టీ వారిని భయాందోళనలకు గురి చేయడమే కాక భారీ ఎత్తున లంచమిస్తే కానీ వదిలేది లేదంటూ హుకుం జారీ చేస్తాడు. ఆ తర్వాత దారికొచ్చే బాధితుల నుంచి డబ్బు తీసుకునేందుకు అతడు ఏకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో కొండ నుంచి బెదిరింపులు ఎదురైన ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రచించి మొన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత విశాఖలోని ఓ క్లబ్ లో బాధితుడి నుంచి లక్ష నగదును తీసుకుంటున్న కొండను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొండ ఇల్లు, అతడి స్నేహితుల ఇళ్లు, వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. నిన్న తన ముందు హాజరుపరిచిన కొండను ఏసీబీ కోర్టు రిమాండ్ కు తరలించింది. కొండకు సంబంధించి అక్రమాస్తులను గుర్తించడంలో ఏసీబీ అధికారులు బిజీబిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News