: 'సాక్షి' రాతలతో భూముల ధరలు పడిపోతున్నాయంటూ అమరావతి రైతుల ఫిర్యాదు
సాక్షి దినపత్రిక, టీవీ చానల్ లో రాజధాని ప్రాంత భూములపై వస్తున్న వరుస కథనాలతో భూముల క్రయ విక్రయాలు తగ్గిపోతున్నాయని, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఏడు గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు తుళ్లూరు, మంగళగిరి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ కథనాలతో ప్రజల్లో ఆందోళన నెలకొందని, తక్షణం చర్యలు తీసుకోవాలని నీరుకొండ, కురగల్లు, బేతపూడి, నవులూరు తదితర గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఇవన్నీ తప్పుడు రాతలేనని, 90 శాతం భూమి రైతుల వద్దనే ఉందని, సాక్షి రాతలతో భూముల ధరలు తగ్గుతున్నాయని, పెట్టుబడులతో వచ్చే విదేశీ సంస్థలు వెనక్కిపోయే అవకాశాలున్నాయని తామిచ్చిన ఫిర్యాదులో రైతులు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.