: ముషార్రఫ్, ఇమ్రాన్ ఖాన్... ‘రా’ ఏజెంట్లట!: దర్యాప్తు చేపట్టామంటున్న పాక్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రప్... భారత్ అంటే అంతెత్తున ఎగిరిపడతారు. నిత్యం భారత్ పై అవాకులు చెవాకులు పేలుతున్న ఆయనపై పాకిస్థాన్ ప్రభుత్వం మొన్న సంచలన ఆరోపణ చేసింది. ముషార్రఫ్ తో పాటు ఆ దేశ పార్లమెంటులో విపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా భారత గూఢచార సంస్థ ‘రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్’ (రా)కు ఏజెంట్లుగా వ్యవహరించారట. వీరిద్దరూ ‘రా’కు సహకరించారన్న ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి పర్వైజ్ రషీద్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రషీద్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆ దేశ ప్రముఖ దినపత్రిక ‘ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ నిన్నటి తన సంచికలో సంచలన కథనాన్ని ప్రచురించింది. ముత్తాహిదా ఖ్వామీ మూవ్ మెంట్ (ఎంక్యూఎం) అధినేత అల్తాఫ్ హుస్సేన్ భారత గూఢచార సంస్థకు ఏజెంట్ గా పనిచేశారంటూ ఆ సంస్థకు చెందిన నేత, కరాచీ మేయర్ ముస్తఫా కమాల్ ఆరోపించి ఈ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జరుగుతున్న దర్యాప్తును మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా ముషార్రఫ్, ఇమ్రాన్ ఖాన్ పేర్లను రషీద్ ప్రస్తావించారు.