: ఏపీ అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయం!... వాయిదా తీర్మానాలకు ముందే ప్రశ్నోత్తరాలు!
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు సవ్యంగా సాగిన సందర్భాలు ఇప్పటిదాకా లేవనే చెప్పాలి. అధికార, విపక్షాల మధ్య కొనసాగిన సవాళ్ల పర్వంతో సభలో నిత్యం రభస నెలకొంటోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయానికి తెర లేచింది. ఈ కొత్త సంప్రదాయం నేటి నుంచే అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకెళితే... అసెంబ్లీలో ముందుగా ఆయా రాజకీయ పక్షాలు ప్రతిపాదించే వాయిదా తీర్మానాలపై స్పీకర్ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటిదాకా కొనసాగుతున్న సంప్రదాయం ఇదే. ఆయా అంశాలపై చర్చకు అనుమతించాల్సిందేనని ప్రతిపక్షం పట్టుబట్టడం, స్పీకర్ పోడియాన్ని ముట్టడించడం, అధికార పక్షం ఎదురు దాడి... వెరసి ప్రారంభమైన వెంటనే సభ వాయిదా. ఇప్పటిదాకా సభలో జరుగుతున్న తంతు ఇదే. ఈ క్రమంలో సభ సమయమంతా వృథా అవుతోందంటూ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సభా సమావేశాలకు సంబంధించి మొన్న జరిగిన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) భేటీలో కోడెల సరికొత్త ప్రతిపాదన చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజా సమస్యలు సభలో ప్రస్తావనకు వచ్చేలాగానే కాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రశ్నోత్తరాలకు ఇకపై ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వాయిదా తీర్మానాలకు ముందుగానే ప్రశ్నోత్తరాలను చేపడదామంటూ సరికొత్త ప్రతిపాదన చేశారు. స్పీకర్ ప్రతిపాదనకు అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీతో పాటు విపక్ష వైసీపీ కూడా సరేనంది. దీంతో నేటి (మంగళవారం) నుంచే ఈ కొత్త సంప్రదాయానికి తెర లేపాలని నాటి భేటీలో నిర్ణయం జరిగిపోయింది. ఈ కొత్త సంప్రదాయం ప్రకారం నేటి నుంచి ఏపీ అసెంబ్లీలో ముందుగా ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాతే వాయిదా తీర్మానాల అంశాన్ని స్పీకర్ ప్రస్తావిస్తారు.