: మనిషికి ఏం కావాలి?...విజయమా?...ఆనందమా?: తనికెళ్ల భరణి


మనిషికి ఏం కావాలి? విజయమా? ఆనందమా? అని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రశ్నించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఓ టీవీ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, మనిషి జీవితంలో సౌందర్యాన్ని అనుభవించడం, ఆస్వాదించడం మర్చిపోతున్నాడని అన్నారు. విజయమే ఆనందం అనే భ్రమలో మనిషి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. విజయం ఆనందం ఇస్తుందేమో కానీ విజయమే ఆనందం కాదని ఆయన చెప్పారు. విజయం సాధించడం కంటే ఆనందంగా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాన్ని వివరించారు. తాను చిన్నప్పుడు ఊరిలో ఉన్నప్పుడు రోళ్లు తయారు చేయడానికి లంబాడీలు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. వారు వచ్చిన ఎడ్లబండి కింద ఒక ఉయ్యాలను కట్టి అందులో పసిపాపను పడుకోబెట్టి, మహిళ జొన్న రొట్టెలు చేస్తే, పురుషుడు రోళ్లు తయారు చేసేవాడని గుర్తు చేసుకున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎర్రటి మిరపకాయలు, కాసింత ఉప్పు కలిపి రోలు మీద పచ్చడి చేసుకుని, తయారు చేసిన రెండు జొన్న రొట్టెలు కలిసి పంచుకుని, ఆనందంగా తినేవారని గుర్తు చేసుకున్నారు. వారు ఏనాడూ దరిద్రంలో ఉన్నట్టు భావించలేదని, వారు చాలా సంతోషంగా ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ లో అవే జొన్నరొట్టెలు వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి సంతోషంగా తింటున్నవారు ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఆనందం అనేది సౌకర్యాలలో ఉండదని, అయితే వాటినే ఆనందం అనే భ్రమలో చాలా మంది బతుకుతున్నారని ఆయన చెప్పారు. ఆనందానికి, విజయానికి తేడా తెలుసుకోగలిగితే జీవితాన్ని మరింత గొప్పగా అస్వాదించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శివుడిపై ఆయన రాసిన 'ఆటగదారా శివా! ఆటగద కేశవ!' అనే పదకవితలను చదివి, వివరించారు.

  • Loading...

More Telugu News