: విదేశీ టూర్లకు వెళితే... 'అధికారికం'గా కనపడరాదు: ఎంపీలకు సలహా
ఏదైనా సంస్థ లేదా వ్యక్తుల ఆహ్వానాల మేరకు విదేశీ టూర్లకు వెళుతున్న పార్లమెంట్ సభ్యులు, అది ప్రభుత్వం తరఫున జరుగుతున్న అధికారిక పర్యటనలా కనిపించకుండా జాగ్రత్త పడాలని రాజ్యసభ కార్యదర్శి సూచించారు. ఏ కార్యక్రమానికైనా అతిథిగా వెళ్లాలని భావించినప్పుడు, సదరు సంస్థ పరిస్థితులు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సైతం పరిశీలించాలని సలహా ఇచ్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందిన తరువాతనే విదేశాలకు వెళ్లాలని, అందుకోసం ప్రయాణ సమయానికి కనీసం రెండు వారాల ముందు దరఖాస్తు చేయాలని వెల్లడించారు. విదేశాలకు వెళ్లే ముందు అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. తమకు వచ్చిన ఆహ్వానం గురించిన వివరాలను విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలియజేయాలని ఎంపీలకు సూచనలు, సలహాలు ఇస్తూ విడుదల చేసిన ప్రకటనలో రాజ్యసభ కార్యదర్శి పేర్కొన్నారు.