: భూములు కొనడం తప్పుకాదు... రాజధాని ప్రకటనకు ముందే ఎందుకు కొన్నారన్నదే ప్రశ్న: నిప్పులు చెరిగిన బొత్స
అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంత్రులు, నేతలు భూములు కొనుగోలు చేయడం తప్పని తాము చెప్పలేదని, అయితే, రాజధాని ప్రకటనకు నెలలు, వారాల ముందే ఎందుకు కొన్నారని ప్రశ్నిస్తున్నామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన బొత్స, రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించకుండా, తమ వారికి ఉప్పందించడం వల్లే, ఆ సమయంలో తెలుగుదేశం నేతలు తమకు అందిన కాడికి భూములను కొనేశారని నిప్పులు చెరిగారు. రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయం వారికి ముందుగానే లీకైందని, అందువల్లే అమరావతిని వదిలి, ఆ ప్రాంతం చుట్టుపక్కల మాత్రమే భూములను మంత్రులు వారి బినామీ పేర్లపై కొనుగోలు చేశారని ఆరోపించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మార్గం తెలియకనే, చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.