: జనం చూస్తుండగానే హైటెన్షన్ వైరును తాకి శ్రీలంక శరణార్థి ఆత్మహత్య
తమిళనాడులోని మధురై జిల్లాలో ఘోరం జరిగిపోయింది. శ్రీలంకలో ఉద్రిక్తతల నేపథ్యంలో చాలాకాలం క్రితం తమిళనాడు చేరుకుని శరణార్థిగా దుర్భర జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి జనం చూస్తుండగానే హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కాలితో విద్యుత్ వైర్ ను టచ్ చేసి మంటల్లో దహనమైపోయాడు. కింద అతడి బంధువులు, వందలాది మంది శరణార్థులు హాహాకారాలు చేస్తుండగా... స్తంభంపైకి ఎక్కిన బాధితుడు నమస్కారం పెట్టి... ఆపై కాలితో విద్యుత్ వైరును తాకడంతో.. వెనువెంటనే పెద్ద శబ్దంతో ఎగసిన మంటల్లో అతడు సజీవ దహనం కావడం అక్కడ కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నాన్ని విరమించాలని కింద నుంచి బంధువులు చేస్తున్న విజ్ఞప్తిని అతడు ఏమాత్రం అంగీకరించలేదు. ఆత్మబలిదానం మినహా తనకు మరో మార్గం లేదంటూ అతడు విద్యుత్ మంటలకు దహనమైపోయాడు. శరణార్థులకు సహాయమందిస్తున్న ఓ స్థానిక అధికారి వేధింపుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడి ఆత్మహత్యతో శరణార్థులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అక్కడే ఉన్న వేధింపుల అధికారిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో సదరు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి గాయపడ్డ అధికారిని ఆసుపత్రికి తరలించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపు చేశారు. బాధితుడి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో ఫుటేజీలను దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి.