: సెక్యూరిటీ లేకుండా రెస్టారెంట్ కు వెళ్లిన పారికర్!
రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఏం చేసినా వెరైటీనే. కేంద్ర కేబినెట్ లో ఆయన కాలు మోపనంత కాలం మంత్రులంతా దర్జాగా హోదా ఒలకబోసేవారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో గోవా సీఎం పదవికి ఉన్నపళంగా రాజీనామా చేసేసి, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పారికర్... మెడలో ఐడీ కార్డుతో సరికొత్త విధానానికి తెర తీశారు. ఆ తర్వాత మిగిలిన మంత్రుల్లో చాలా మంది ఎక్కడికెళ్లినా ఐడీ కార్డులు మెడలో వేసుకుని తిరుగుతున్నారు. ఇక రాజకీయాల్లో అవినీతి మకిలి అంటని పారికర్ కు శత్రువులు కూడా దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే రక్షణ శాఖ మంత్రి హోదాలో ఆయనకు ఉగ్రవాదుల నుంచి ముప్పున్నట్లే. అయితే ఈ భయాలన్నీ పక్కనబెట్టిన పారికర్... సెక్యూరిటీని వదిలేసి గోవా రాజధానిలో చక్కర్లు కొట్టారు. పనాజీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్లిన ఆయన పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్లోకి దూరిపోయారు. చక్కగా అక్కడి తేనీటిని ఆస్వాదించారు. కేంద్ర మంత్రి హోదాలో సెక్యూరిటీ లేకుండా అక్కడ ప్రత్యక్షమైన పారికర్ ను చూసి అక్కడున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు.