: సహజీవనం అంటే పెళ్లయినట్టే లెక్క: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్య
వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లి ఫోటోలు అందుబాటులో లేని వేళ, సహజీవనమే పెళ్లికి సాక్ష్యంగా నిలుస్తుందని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. యువతీ, యువకులు సుదీర్ఘ కాలం కలిసి జీవిస్తే, వారిద్దరి వివాహం జరిగిందనడానికి దానిని సాక్ష్యంగా పరిగణించవచ్చని తెలిపింది. అంతకుముందు ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై తిరునల్వేలి ఫ్యామిలీ కోర్టు విచారణ చేపట్టేందుకు నిరాకరించగా, ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తన వద్ద వివాహం జరిగిందని నిరూపించే సాక్ష్యాలు లేవని ఆమె కింది కోర్టుకు చెప్పడంతో, పిటిషన్ కు విచారణార్హత లేదని న్యాయమూర్తి కొట్టివేశారు. ఆపై కల్పించుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.మణికుమార్, జస్టిస్ సీటీ సెల్వంలతో కూడిన ధర్మాసనం తిరునల్వేలి కోర్టు తీర్పును నిలిపివేసింది. రుజువులు లేని వేళ, దీర్ఘకాలం కొనసాగిన సహజీవనాన్ని పెళ్లికి సాక్ష్యంగా తీసుకోవాలని న్యాయమూర్తులు అభిప్రాయానికి వచ్చారు. ఈ కేసులో యువతి తన భర్తతో తీయించుకున్న చిత్రాలను కోర్టు ముందుంచింది. తాము 21 సంవత్సరాలుగా కలిసున్నామని, ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారని చెప్పింది. తన పోషణకు కొంత డబ్బు ఇప్పించాలన్నది ఆమె వాదన కాగా, వివాహం కాలేదని, ఆమె తన భర్తగా చెబుతున్న వ్యక్తి వాదించాడు. పెళ్లయినట్టు సాక్ష్యాలు లేకపోయినా, కేసును విచారించాలని మద్రాస్ హైకోర్టు మధురై డివిజన్ బెంచ్ ఆదేశించడంతో ఈ కేసు మరోసారి ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చింది.