: ధర్మశాలలో పాక్ బృందం... భారత్-పాక్ మ్యాచ్ భద్రతపై సమీక్ష
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈ నెల 19న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పఠాన్ కోట్ దాడి, ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో భారత్ లో పర్యటించేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రత్యేకించి ధర్మశాలలో ఆడే విషయంలో ఆ దేశం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం పాక్ ప్రభుత్వం పంపిన అత్యున్నత స్థాయి బృందం ధర్మశాల చేరుకుంది. భారత అధికారులతో కలిసి స్టేడియం, ధర్మశాల నగరాన్ని పరిశీలించనున్న సదరు బృందం ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ సీఎం, పోలీసు అధికారులతో చర్చించనుంది. ఈ బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే... పాక్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.