: నో డౌట్... వరల్డ్ కప్ మాదే: ధోనీ
ఆసియా టీ-20 కప్ ను సాధించిన ఉత్సాహంతో వరల్డ్ టీ-20 కప్పును కూడా గెలుచుకొస్తామని, అందుకోసం టీమిండియా సర్వ సన్నద్ధంగా ఉందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు అందరూ రాణిస్తున్నారని, లోయర్ ఆర్డర్ లో మ్యాచ్ ని ఫినిష్ చేసే సత్తా ఉన్నవారు ఎందరో ఉన్నారని అన్నారు. భారీ అభిమానుల మధ్య సవాళ్లను ఎదుర్కోవాల్సిన స్థితిలో కోహ్లీ చక్కగా రాణిస్తున్నాడని కితాబిచ్చిన ధోనీ, బంగ్లాదేశ్ తో ఫైనల్ పోరులో 7 బంతులు మిగిలివుండగానే విజయం సాధించడం వెనుక, శిఖర్ ధావన్ వేసిన పునాది ఎంతో సహకరించిందని చెప్పుకొచ్చాడు. కప్పు గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ, ప్రస్తుతం జట్టు అన్ని విధాలుగా సమతూకంగా ఉందని, యువ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు చక్కగా రాణిస్తున్నారని అన్నాడు. మంచి యార్కర్లు వేస్తున్న బుమ్రా, ఇంకాస్త కొత్తగా ప్రయత్నించాలని సలహా ఇచ్చిన ధోనీ, హార్దిక్ సైతం బౌలింగ్ చేయగలగడం, అతని ఫీల్డింగ్ నైపుణ్యం ఇండియాకు కలిసొచ్చే అంశాలని అన్నాడు. ఈ సమయంలో యువరాజ్ సింగ్ ను నాలుగో స్థానంలో బ్యాటింగుకు పంపడం కష్టమని, కానీ తన స్థానంలో యువీ చక్కగా ఆడుతున్నాడని అన్నాడు. ఇదే సమావేశంలో పాల్గొన్న ధావన్, తాను చేసిన 60 పరుగులూ ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. ఏ సమయంలోనూ తాము నియంత్రణ తప్పలేదని, ఒత్తిడిలోకి వెళ్లలేదని అన్నాడు.