: ఏపీకి ఇంతకంటే ఏం చేస్తాం... ఇప్పటికే రూ.1.72 లక్షల కోట్లిచ్చాం!: ‘ఫ్యాక్ట్ షీట్’లో కేంద్రం వెల్లడి


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటులో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటూ టీడీపీ సర్కారు చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘ఫ్యాక్ట్ షీట్’ పేరిట ఓ సరికొత్త నివేదికను రూపొందించిన నరేంద్ర మోదీ సర్కారు, త్వరలోనే దానిని ఏపీ ముందు పెట్టనున్నట్లు సమాచారం. ఈ నివేదికపై నిన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ తన ఆన్ లైన్ ఎడిషన్ లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం... రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2014 నుంచి ఇప్పటిదాకా ఏపీకి రూ.1.72 లక్షల కోట్ల నిధులను ప్రకటించినట్లు కేంద్రం వాదిస్తోంది. ఇందులో గడేతాది డిసెంబర్ లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన రూ.60 వేల కోట్లను పక్కనబెడితే... వివిధ పథకాల కింద రాష్ట్రానికి కేంద్రం రూ.1.12 లక్షల కోట్లను ప్రకటించింది. ఈ నిధుల్లో రైల్వే ప్రాజెక్టులకు సంబందించి రూ.20,236 కోట్ల నిధులున్నాయి. ఇక రక్షణ శాఖ రూ.5,700 కోట్ల విలువ చేసే కొత్త ప్రాజెక్టులను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక కేంద్ర వాణిజ్య శాఖ రాష్ట్రానికి ప్రకటించిన రూ.2,700 కోట్లలో ఇప్పటికే రూ.1,900 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఐఐటీ, ఐఐఎంల కోసం కేంద్రం ఏపీకి రూ.7 వేల కోట్లను ప్రకటించింది. వివిధ గ్రాంట్ల కింద రూ.15 వేల కోట్లు ఏపీకి విడుదలయ్యాయి. విభజన సమయంలో ఏపీ రూ.16,000 కోట్ల లోటులో ఉందని పేర్కొన్న కేంద్రం, దానిని పూరించేందుకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2,303 కోట్లను విడుదల చేయగా, రూ.6,609 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదంటున్న సీఎం నారా చంద్రబాబునాయుడి వాదనను తిప్పికొట్టే క్రమంలోనే నరేంద్ర మోదీ సర్కారు ఈ నివేదికను ప్రత్యేకంగా తయారు చేసినట్లు సమాచారం. మరి ఈ నివేదికపై ఏపీ సర్కారు ఏం చెబుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News