: ఉగ్రవాదులతో పోరాడాం... డబ్బివ్వండి: పంజాబ్ కు బిల్లు పంపిన మోదీ సర్కారు


ఓ రాష్ట్రానికి వచ్చి, ఉగ్రవాదులతో సైన్యం పోరాడినందుకుగాను కేంద్రానికి బిల్లు చెల్లించాలా? అవుననే అంటోంది మోదీ సర్కారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ పై దాడి చేసిన వేళ, కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేసి ముష్కరులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో తమకు రూ. 6.35 కోట్ల రూపాయలు ఖర్చయిందని, దీన్ని చెల్లించాలని కేంద్రం నుంచి పంజాబ్ ప్రభుత్వానికి తాఖీదులు అందాయి. కేంద్ర హోం శాఖ నుంచి జనవరి 20 తేదీతో ఉన్న లేఖ సారాంశం మేరకు, జనవరి 2 నుంచి 27 వరకూ పఠాన్ కోట్, దాని పరిసర ప్రాంతాల్లో 20 కంపెనీ పారా మిలటరీ బలగాలను కేంద్రం మోహరించింది. ఇందుకుగాను ఒక్కో కంపెనీకి రోజుకు రూ. 1,77,143 రూపాయలు ఖర్చయిందని, వీటిని చెల్లించాలని కోరింది. 11 కంపెనీల సీఆర్పీఎఫ్, 9 కంపెనీల బీఎస్ఎఫ్ దళాలు ఉగ్రదాడి తరువాత ఎయిర్ బేస్ కు వచ్చినందుకు అయిన రవాణా చార్జీలను భరించాలని సూచించింది. ఇక ఈ బిల్లును చెల్లించేందుకు పంజాబ్ ప్రభుత్వం ససేమిరా అంది. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన అకాలీదళ్ ప్రభుత్వం ఈ లేఖకు సమాధానం ఇస్తూ, జాతి భద్రత కోసమే సైన్యం వచ్చిందని గుర్తు చేస్తూ, ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలపై వేయరాదని కోరింది.

  • Loading...

More Telugu News