: నా కుమార్తె రాదు, నాకొద్దు: గుజరాత్ సీఎం
వచ్చే సంవత్సరం గుజరాత్ కు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, తాను మరోమారు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని భావించడం లేదని అనందీబెన్ పటేల్ వ్యాఖ్యానించారు. తన వయసు 75 సంవత్సరాలు దాటిందని గుర్తు చేసిన ఆమె, ఎనిమిది పదుల వయసులోనూ ఇలాగే ఉండాలని అనుకోవడం లేదని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రిగా మరొకరికి అవకాశం ఇవ్వాలని ఉందని, యువత ముందుకు వచ్చి బాధ్యతలు స్వీకరించాలని ఆమె కోరారు. 2017 తరువాత రెండో విడత సీఎం పీఠం తనకు దక్కాలని కోరుకోవడం లేదన్నారు. తన కుమార్తె అనార్ పటేల్ కు రాజకీయాలంటే ఎంత మాత్రమూ ఆసక్తి లేదని, క్రియాశీల రాజకీయాల్లోకి ఆమె రాబోదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. ఇటీవలి నగర పాలికల ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు వచ్చాయని, గ్రామ పంచాయతీల్లోనూ తమ బలం పెరిగిందని అన్నారు. పటేల్ వర్గం యువనేత హార్దిక్ గురించి వ్యాఖ్యానించాలని కోరగా, ఆయన, ఓ నలుగురు స్నేహితులతో కలసి ఒంటరిగా బయలు దేరాడని, ఆపై కాంగ్రెస్ మద్దతిచ్చిందని అన్నారు. కాంగ్రెస్ చేరడంతో హార్దిక్ దారి మారిందని అభిప్రాయపడ్డారు.