: మదర్సాలపై పాక్ ప్రధాని సలహాదారుదీ అదే మాట!
అరబిక్ భాషలో విద్యాబోధన కోసమంటూ వెలుస్తున్న మదర్సాలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నవే. ప్రత్యేకించి హిందూ భావజాలమున్న వారు ఈ ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇదే వాదనను బలపరుస్తూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా పనిచేస్తున్న సర్తాజ్ అజీజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వారం రక్షణ శాఖ వ్యవహారాలకు సంబంధించి వార్తలు రాసే పలువురు మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేకించి ఉత్తర వజీరిస్థాన్ లోని మదర్సాలు ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మారాయని ఆయన ఆరోపించారు. అయితే ఈ తరహా కార్యకలాపాలు అఫ్ఘన్ నుంచి తమ దేశానికి వలస వస్తున్న వారి కారణంగానే జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ మదర్సాను తాను స్వయంగా పరిశీలించిన వైనంపై అజీజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మిరాన్ షాలోని ఓ మదర్సాకు వెళ్లిన సందర్భంగా అక్కడ బయటకు ఏమీ కనబడలేదు. అయితే లోపలికి వెళ్లి చూడగా, అందులో 70 గదుల భారీ బేస్ మెంట్ ఉంది. సదరు బేస్ మెంట్ మూడంతస్తుల్లో ఉంది. ఐదారు ఐఈడీ (అత్యాధునిక బాంబులు) తయారీ కేంద్రాలున్నాయి. ఆత్మాహుతి దాడులకు సంబంధించిన నాలుగైదు శిక్షణా కేంద్రాలున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, వీఐపీ రూములు, సమావేశ మందిరాలు... ఆధునిక మౌలిక వసతులతో కనిపించాయి’’ అని ఆయన పేర్కొన్నారు.