: జంక్ మెయిల్ తెచ్చిన అదృష్టం... రూ. 1.50 కోట్ల బహుమతి!
ఈ వార్త చదివిన తరువాత జంక్, స్పామ్ మెయిల్ బాక్సులను కళ్లు మూసుకుని డిలీట్ చేసే ముందు మరోసారి ఆలోచించుకోవాల్సి వస్తుందేమో! మామూలుగా అయితే స్పామ్ బాక్సు మెయిల్స్ అసలు పట్టించుకోము. వాటిల్లో కూడా విలువైన సమాచారం ఉండే అవకాశముంది. వాటిని డిలీట్ చేసే ముందు మరోసారి చూడాలని సలహా ఇస్తున్నారు ఆస్ట్రేలియాకు చెందిన రచయిత్రి హెలెన్ గార్నర్. ఇంతకీ విషయం ఏంటంటే, యూఎస్ లోని యేల్ వర్శిటీ, ఇటీవల తొమ్మిది మందికి సాహిత్య పురస్కారాలను 'విండమ్ షాంప్ బెల్' పేరిట ప్రకటించింది. వారిలో గార్నర్ కూడా ఉన్నారు. అయితే, గార్నర్ ఫోన్ నంబర్ వర్శిటీ అధికారుల వద్ద లేకపోవడంతో, అవార్డు విషయాన్ని వివరిస్తూ, తమను సంప్రదించాలని ఆమెకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే, సదరు ఈ-మెయిల్ గార్నర్ మెయిల్ బాక్స్ లోని స్పామ్ కు వెళ్లిపోయింది. చూడకుండా స్పామ్ ను కూడా డిలీట్ చేసే అలవాటు లేని ఆమె, యేల్ వర్శిటీ నుంచి వచ్చిన మెయిల్ చూసి ఆశ్చర్యపోయారు. ఇక తన వివరాలను వారికి పంపారు. పురస్కారంలో భాగంగా 1.5 లక్షల డాలర్లను (దాదాపు కోటిన్నర రూపాయలు) గార్నర్ అందుకోనున్నారు. కాబట్టి జంక్ మెయిల్స్ అని చూడకుండా తొలగించేస్తే, అదృష్టం దూరమయ్యే ప్రమాదమూ ఉంది సుమా!