: దంచికొట్టిన ధోనీ సేన!... ఆరోసారి ఆసియా కప్ గెలిచిన టీమిండియా!


అందరి అంచనాలు నిజమయ్యాయి. ఆసియా కప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ధోనీ సేన ఆరోసారి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. నిన్న బంగ్లాదేశ్ నగరం మిర్పూర్ లోని షేరే బంగ్లా స్టేడియంలో చివరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటిన ‘మెన్ ఇన్ బ్లూ’ ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే బంగ్లా కూనలను చిత్తు చేశారు. 15 ఓవర్లలో 121 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే బంగ్లా బౌలర్లు షాకిచ్చారు. టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (1) రెండో ఓవర్ లోనే ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (41), మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (60)తో కలిసి బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మరో వికెట్ పడకుండానే వీరిద్దరూ లక్ష్యం చేరుకుంటారకున్న సమయంలో బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్... ధావన్ ను పెవిలియన్ చేర్చాడు. ధావన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (20) జూలు విదిల్చాడు. కేవలం ఆరు బంతులే ఎదుర్కొన్న ధోనీ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. రెండు సిక్స్ లు, ఓ ఫోర్ బాదిన ధోనీ... తానెదుర్కొన్న చివరి బంతిని సిక్స్ గా మలచి మిగిలిన కార్యాన్ని మరింత టెన్షన్ లేకుండానే ముగించేశాడు. విన్నింగ్ షాట్ కొట్టిన ధోనీ, ఆ తర్వాత టీమిండియా తరఫున ఆరో ఆసియా కప్ టైటిల్ ను సగర్వంగా అందుకున్నాడు. అంతకుముందు నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకున్న బంగ్లాదేశ్ 120 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News