: జైపూర్‌లో ఆదర్శ ఉపాధ్యాయుడు.. ప్రతీ ఏటా 50మంది బాలికలకు ఉచిత శిక్షణ
సూపర్ 30... ఈ పేరు చాలామందికి తెలుసు. బీహార్ కు చెందిన ఆనంద్ కుమార్ ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి 'సూపర్ 30' పేరిట వారికి ఐఐటీ ప్రవేశ పరీక్షకు ఉచితంగా శిక్షణ ఇస్తాడు. వారిలో చాలామంది ఐఐటీలో సీట్లు పొందుతారు. అలాంటి ఆనంద్ కుమార్ నుంచి స్ఫూర్తి పొందిన ఓ టీచర్ జైపూర్లో వున్నాడు. ప్రతీ ఏడాది 50మంది బాలికలకు ఉచిత శిక్షణనిస్తూ జైపూర్‌లో ఓ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. అజ్మిర్‌లోని ఓ మిషనరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సునీల్ జోస్ .. సమాజానికి తనవంతు సహాయాన్నందించాలనే ఉద్దేశంతో సర్కారీ బడుల్లో పదోతరగతి చదివే విద్యార్థినులకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నారు. ఐదు సంవత్సరాలుగా ఆయన ఈ సేవను అందిస్తున్నారు. తాను పనిచేస్తున్న స్కూల్లో తన బాధ్యతలు నిర్వహించిన తరువాత... ఇక్కడి శ్రీనగర్ రోడ్డులోని గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రతీ రోజు రెండు-మూడు గంటలు బాలికలకు ఉచితంగా చదువు చెబుతున్నారు. ఆ స్కూలులో లెక్కల మాస్టారు లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. సునీల్ జోస్ ఆ లోటు తీర్చుతూ విద్యార్థుల చక్కని భవిష్యత్తు చెదిరిపోకుండా ప్రోత్సహిస్తున్నారు. కేరళకు చెందిన జోస్ రెండు దశాబ్దాల క్రితం అజ్మీర్‌కు వచ్చి అక్కడ ఓ స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. సర్కారీ బడిలో గణితంలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండడాన్ని గమనించి ఆయన.. ఆ లోటు తీర్చేందుకు కంకణం కట్టుకున్నారు. గణితంలో వెనకబడి ఉండడంతో విద్యార్థులు చదువు కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదని.. ఈ లోటును తీర్చుతూ, వారి భవిష్యత్తును సరిదిద్దేందుకు తాను ఐదు సంవత్సరాలుగా ఉచితంగా శిక్షణనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచిన జోస్ ను స్థానికులు ప్రశంసిస్తున్నారు.