: దేశమంతటా కమలం వికసించాలి: అమిత్ షా


ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పెకలించాలంటే దేశమంతటా బీజేపీ మాత్రమే విజయం సాధించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉంటే సమన్వయంతో పని చేయడం జరుగుతుందని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ చిత్తశుద్ధితో పని చేసినట్టు, ఏపీ గౌరవం కాపాడేందుకు బీజేపీ కూడా పని చేస్తోందని ఆయన చెప్పారు. దేశంలో మార్పు తీసుకొస్తామని ఎన్నికల్లో విజయం సాధించకముందే చెప్పామని ఆయన గుర్తు చేశారు. మేము అదే పని చేస్తున్నామని ఆయన అన్నారు. గ్రామీణ జీవనం మెరుగుపరచడంలో భాగంగా కేవలం రోడ్ల నిర్మాణానికి 19 వేల కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. ప్రతి గ్రామానికి 21 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని ఆయన చెప్పారు. ముద్రాబ్యాంకు ద్వారా ఏపీలో 6,30,000 మందికి లోన్లు అందజేశామని చెప్పారు. పేదల జీవితానికి భరోసా ఉండాలని భావించి 330 రూపాయలకే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని ఆయన చెప్పారు. అలాగే నిరుపేదలకు 12 రూపాయలకే ఇన్సూరెన్స్ ఇచ్చామని ఆయన చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ లక్ష రూపాయల ఉచిత వైద్యం అందుకునే సౌకర్యం కల్పించామని ఆయన చెప్పారు. స్టార్టప్ ల ద్వారా యువత పరిశ్రమలు పెట్టే దిశగా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. సరిహద్దుల్లో ఎవరైనా తోక జాడించే అవకాశం లేకుండా చేశామని ఆయన చెప్పారు. హేమరాజ్ తల నరికినట్టు మరో సైనికుడి తల నరికే ధైర్యం ఎవరూ చేయలేరని ఆయన వివరించారు. దేశ భద్రతకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News