: తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభం... బడ్జెట్ సమావేశాలపై చర్చ!
త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతోన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాళేశ్వరంతో పాటు ప్రాణహిత, తుపాకులగూడెం ప్రాజెక్టుల పునరాకృతి, విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లు, కొత్త గనుల విధానం, పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన ఎన్నికల చట్ట సవరణ, బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల చట్టసవరణతో పాటు, మెదక్ జిల్లాలో టీఎస్‌ఐఐసీకి 50 ఎకరాల కేటాయింపుకు పచ్చజెండా ఊపనున్నారు. బడ్జెట్‌పై చర్చించి దానికి తుది రూపునిస్తారు. ఈ నెల 10న ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆమోదం తెలపనున్నారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారుచేస్తారు. పలు శాఖలకు సంబంధించిన ఉత్తర్వులతో పాటు కొత్త నియామకాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.