: కన్నయ్య రాకతో సీపీఎం, కాంగ్రెస్ లకే నష్టం: కేరళ బీజేపీ అధ్యక్షుడు
జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ లీడర్ కన్నయ్య కుమార్ పశ్చిమ బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. దీంతో కన్నయ్య ఎన్నికల ప్రచారంపై బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైంది. కన్నయ్య కుమార్ కేరళ ప్రచారానికి వస్తే బీజేపీకి వచ్చిన నష్టం లేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ అన్నారు. ఆయన ప్రచారం చేస్తే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకే నష్టమని ఆయన చెప్పారు. అదే సమయంలో కన్నయ్య కేరళ వస్తే ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. అలా జేఎన్యూలో ఏం జరుగుతోందో, ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనల పట్ల మరోసారి జేఎన్యూ స్టూడెంట్స్ తో చర్చ లేవనెత్తాలని ఉందని ఆయన అన్నారు. కన్నయ్యను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని ఆయన చెప్పారు. కాగా, దోశద్రోహం ఆరోపణలపై అరెస్టై జైలుకు వెళ్లిన కన్నయ్య కుమార్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చూపడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో కన్నయ్యకు బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో కన్నయ్యకు యువతలో ఆదరణ లభిస్తోంది. బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ తన వాగ్ధాటితో కన్నయ్య యువతలో ఆదరణ పెంచుకుంటున్నాడు. దీంతో సీపీఎం ఉనికి వున్న కేరళ, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో అతనితో ప్రచారం మరింత లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.