: టీట్వంటీ వరల్డ్ కప్ ను అవినీతి రహితంగా నిర్వహిస్తాం: ఐసీసీ
టీట్వంటీ వరల్డ్ కప్ ను అవినీతి రహితంగా నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఐసీసీ ప్రకటించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో నిఘాను పెంచామని ఐసీసీ తెలిపింది. టీట్వంటీ వరల్డ్ కప్ లో పురుషులు, మహిళలు కలసి మొత్తం 58 మ్యాచ్ లలో ఆడనున్నారని ఐసీసీ పేర్కొంది. ఈ టోర్నీ అభిమానులకు సరికొత్త అనుభూతిని మిగుల్చుతుందని చెప్పిన ఐసీసీ, అవినీతిరహితంగా టోర్నీ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఆటగాళ్లు, సహకార సిబ్బంది అందరికీ అవినీతిపై అవగాహన కల్పిస్తామని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ ఛైర్మన్ సర్ రోనీ ఫ్లాన్ గన్ తెలిపారు. జట్టులో భాగమైన ప్రతి ఒక్కరికీ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు చెందిన అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన ఓ పుస్తకం ఇస్తామని చెప్పారు. ఎవరైనా అనుమానాస్పద రీతిలో వారిని సంప్రదిస్తే ఆ వివరాలు తమకు తెలియజేయాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎవరైనా, ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ సౌకర్యం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు.