: నా కొడుకు అమాయకుడు... జగన్ ప్రోద్బలంతోనే తప్పుడు కేసులు... ఆ వీడియో ఎప్పటిదో..: రావెల
తన కుమారుడు సుశీల్ పై వైకాపా అధినేత వైఎస్ జగన్ తప్పుడు కేసులు పెట్టించాడని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. ఎప్పటిదో, ఎక్కడిదో దొంగ ఫుటేజ్ ని తీసుకువచ్చి, ఓ అమాయక దళిత బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నాడని నిప్పులు చెరిగారు. జగన్ ప్రోద్బలంతోనే 3వ తేదీన ఎఫ్ఐఆర్ లో లేని తన కుమారుడి పేరును, ఆపై చేర్చారని, నిర్భయ చట్టం కింద కూడా కేసు పెట్టారని అన్నారు. బంజారాహిల్స్ స్థానికులు తన కుమారుడు, ఆయన డ్రైవర్ ను చితక్కొట్టారని తెలిపారు. కేసును తప్పుదారి పట్టించేందుకు వైఎస్ఆర్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, జగన్ మీడియా గోబెల్స్ ప్రచారం చేసి పోలీసులు, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందని విమర్శించారు. తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, తన కుమారుడు నిర్దోషిగా బయట పడతాడన్న విశ్వాసం ఉందని అన్నారు. తననిలా బజారులోకి లాగి, వ్యక్తిగత కక్షలకు, కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ, తన కుమారుడిని బలి చేశారని, ఇందుకు జగన్, ఆయన పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. మీడియాలో చూపుతున్న వీడియో ఫుటేజ్ ఎప్పటిదోనని అన్నారు. కేసు వెనకున్న అసలు సూత్రధారి జగన్ అని, ఆయన రాజకీయంగా తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. వైకాపాకు అండగా ఉన్న దళితులు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు కావడం వల్లే జగన్, ఈ తరహా చర్యలకు దిగుతున్నారని అన్నారు.