: చొరబాటు నిజమే... ఏం జరిగినా ఎదుర్కొనేందుకు అహ్మదాబాద్ కు తరలిన ఎన్ఎస్జీ!
పాకిస్థాన్ నుంచి గుజరాత్ లోని సముద్ర తీరం గుండా ఉగ్రవాదులు ప్రవేశించారని వచ్చిన హెచ్చరికలు నిజమేనని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. గుజరాత్ లోని కచ్ సమీపంలో ఓ పాకిస్థాన్ బోటు ఖాళీగా ఉండటాన్ని గుర్తించిన పోలీసులు, ఉగ్రవాదులు దాని ద్వారానే దేశంలోకి వచ్చుంటారని అనుమానిస్తున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులున్న చోట ఉగ్రవాదులు విరుచుకుపడవచ్చని భావిస్తున్న కేంద్రం, ఎన్ఎస్జీ బలగాలను అహ్మదాబాద్ కు తరలించింది. ఏం జరిగినా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో, రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించిన ఆనందీ బెన్ పటేల్ సర్కారు, ఎక్కడికక్కడ సోదాలు జరుపుతోంది. గుర్తింపు కార్డులు లేనివారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, 10 మంది వరకూ ఇండియాలోకి చొరబడ్డారని తొలిసారిగా పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.