: టైం స్టార్ట్... మూడు నిమిషాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టండి చూస్తా: ముద్రగడపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ
తాను తలచుకుంటే కేవలం 3 నిమిషాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోస్తానని కాపు నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన "టైం స్టార్ట్... నీకు మూడు నిమిషాల సమయం ఇస్తున్నా. ప్రభుత్వాన్ని పడగొట్టు చూద్దాం" అని సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలు కాపు జాతి మొత్తం తలదించుకునేలా ఉన్నాయని, ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు ముద్రగడ, వైకాపా నేత జగన్ చేతిలో కీలుబొమ్మలా మారారని అన్నారు. జగన్, ముద్రగడ ఒకేలా మాట్లాడుతున్నారని, కాపు రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ, ఈ తరహా విమర్శలు సరికావని హితవు పలికారు. కాపులకు మంత్రి పదవులను ఇచ్చారని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించారని, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చారని నారాయణ గుర్తు చేశారు. కేవలం పచ్చ చొక్కాలు ధరించిన వారికే కాపు రుణాలు ఇస్తున్నారని ముద్రగడ చేసిన ఆరోపణలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు.