: మా రక్తంతో నీ కులుకులేంటి?: మాల్యాకు బహిరంగ లేఖ!
ఉద్యోగులకు సుదీర్ఘ కాలంగా వేతనాలు చెల్లించకుండా, ఇప్పుడు దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న 'కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్' విజయ్ మాల్యాకు కింగ్ ఫిషర్ ఉద్యోగులు బహిరంగ లేఖ రాశారు. తమ రక్తంతో ఆయన చేతులు తడుపుకున్నారని ఆరోపించిన ఉద్యోగులు, ఇప్పటికి కూడా ఆయన మనసు మారలేదని ఆరోపించారు. "నీ వైఖరితో మేము ఇంకా బాధలు పడుతున్నాం. కింగ్ ఫిషర్ ఎయిర్ వేస్ ఇంకా ఉంది. పే రోల్స్ లో మా పేర్లు ఉన్నాయి. ఎటొచ్చీ మాకు వేతనాలే ఇవ్వడం లేదు. మీ నుంచి ఏనాడూ మాకు సమాచారం లేదు. సంస్థను మూసేయలేదు. తిరిగి విమానాలు నడుపుతామని చెప్పిన హామీని నెరవేర్చే దిశగా ఒక్క అడుగు కూడా మీరు వేయలేదు. కంపెనీ షట్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. మాకు బకాయి పడ్డ వేతనాలు ఇచ్చేందుకు డబ్బు లేదన్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్, లగ్జరీ యాచ్ ఎక్కడి నుంచి వచ్చాయి?" అని ఈ లేఖలో ఉద్యోగులు ప్రశ్నించారు. ఉద్యోగుల రక్తంతో కులుకుతున్నాడని ఆరోపించారు. తన వ్యవహారంతో మాల్యా దేశానికి చెడ్డ పేరు తెచ్చారని, భారత విమానయాన రంగంపై నమ్మకం పోయేలా చేశారని ఆరోపించారు.