: నాకంటే మొనగాడా? లేక మేధావా?: బాబుపై నిప్పులు చెరిగిన ముద్రగడ
ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు చెందిన నేతలను పంపించి తనచేత దీక్ష విరమింపజేశారని కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, నిరాహార దీక్ష విరమించిన వెంటనే తనను అవమానించడం మొదలు పెట్టారని అన్నారు. కాపు రుణమేళా ఏలూరులో మొదలుపెట్టి తనను బండబూతులు తిట్టించారని ఆయన పేర్కొన్నారు. తాను కాపు ద్రోహినని, కాపు జాతికి అన్యాయం చేసిన వ్యక్తినని, కాపులను అధోగతిపాలు చేస్తున్నానని, తన వెంట కాపులెవరూ లేరని, తనకు మాట్లాడడం కూడా చేతకాదని, జగన్ ఏది చెబితే అదే మాట్లాడుతానని ఇలా అనరాని మాటలు అని దారుణంగా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా తాను పెదవి విప్పి మాట్లాడకూడదంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నప్పుడు నోరుమూసుకుని ఎలా ఉంటానని ఆయన నిలదీశారు. విశాఖపట్టణంలో మాట్లాడినప్పుడు 2 ఎకరాల ఆసామి 2 లక్షల కోట్లు ఎలా సంపాదించగలిగాడని ప్రశ్నించానని... టీడీపీ నేతలు తనకు ఫోన్ చేసి, ఆ వ్యాఖ్యలపై చంద్రబాబు బాధపడుతున్నారని చెప్పగానే...వాటిపై క్షమాపణ కోరానని ఆయన తెలిపారు. చంద్రబాబు, తాను ఒకేసారి రాజకీయ ప్రవేశం చేశామని ఆయన అన్నారు. అయితే ఆయన దగ్గర డబ్బుంది కాబట్టి అధికారం కలిగిన వాడు, అపరమేధావి అయ్యాడని ఆయన చెప్పారు. తన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి అధికారం లేని వాడిని, మేధావి తనం లేని వ్యక్తిని, జగన్ చెబితే కానీ మాట్లాడలేని అధముడిని అయిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బే లేకపోతే... చంద్రబాబేమన్నా తనకంటే మొనగాడా? లేక అపరమేధావా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు మొనగాళ్లను, మేధావులను చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తన వెంట ఎవరు వచ్చినా పాత కేసులు తవ్వుతామని, రైల్ దహనంలో వీడియో పుటేజ్ లు, పేపర్ లో వచ్చిన ఫోటోలు ఉన్నాయి...వాటి ఆధారంగా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తన వెంట ఎవరూ రావాల్సిన అసవరం లేదని, కాపు సోదరులంతా తమ తమ ఇళ్ల దగ్గర కూర్చుని, ప్లేటుపై గరిటెతో కొడుతూ ఉండాలని ఆయన సూచించారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు శబ్దం చేస్తే...చంద్రబాబుకు కాపుల ఆకలి కేకలు వినిపిస్తాయేమో చూడాలని ఆయన చెప్పారు. గతంలో ఎస్సీలను ఏబీసీడీలుగా విభజిస్తానని, మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టాడని విమర్శించారు. ఈసారి చంద్రబాబు కాపుల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు చెబుతున్నాడని, కాపులను ఆయన నిలువునా మోసం చేశాడని ముద్రగడ అన్నారు.