: మొబైల్ ఫోన్ అని చెప్పి... అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటగట్టిన వైనం!


ఈ హైటెక్ కాలంలో మోసాలు కూడా హైటెక్ లెవెల్ లోనే జరుగుతున్నాయి. బహుమతి వచ్చిందని చెప్పి, డబ్బులు దండుకుని, ఓ వ్యక్తిని నిలువునా ముంచిన వైనం ఇది. హైదరాబాదు, జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రి పరిసరాల్లో ఆటో నడుపుతూ జీవనం సాగించే రాజు అనే వ్యక్తికి వారం క్రితం గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. హిమాలయా హెర్బల్ ఆయుర్వేదిక్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నానని ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిర్వహించిన లక్కీ డ్రాలో మీ మొబైల్ ఫోన్ నెంబర్ కు బహుమతి లభించిందని చెప్పాడు. అడ్రస్ చెబితే బహుమతి పంపిస్తామని చెప్పాడు. బహుమతి వచ్చిన తరువాత కేవలం 2,625 రూపాయలు చెల్లిస్తే మంచి స్మార్ట్ ఫోన్ మీ సొంతమవుతుందని ఆయన తెలిపాడు. తర్వాత ఆ మొబైల్ వచ్చిందని పోస్టాఫీసు నుంచి ఫోన్ రావడంతో దానిని 2,625 రూపాయలు చెల్లించి రాజు తీసుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్లి ఆ పార్సిల్ తెరిచి చూసిన రాజు షాక్ తిన్నాడు. ఎందుకంటే 2,625 రూపాయలు చెల్లించి తీసుకున్న పార్సిల్ లో 15 రూపాయల విలువ చేసే అల్లం వెల్లుల్లి పేస్టు బాటిల్ ఉంది. దీంతో మోసపోయినట్టు గ్రహించిన రాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News