: గవర్నర్ ప్రసంగం వివరాలు ఇవిగో!
బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇబ్బందుల్లో రెండంకెల వృద్ధిరేటు సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన అభినందించారు. 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమం ద్వారా 72 లక్షల పట్టాదార్ల భూములు రికార్డుల్లో నవీకరించామని ఆయన చెప్పారు. ఈ ఏడాదిలో 15 ఎంబీపీఎస్ తో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అంతర్జాల సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. 150 రూపాయల చెల్లింపుతో మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి తెగలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఇందు కోసం ఏర్పాటైన మంజునాథ కమిషన్ 8 నెలల్లో నివేదిక ఇస్తుందని ఆయన చెప్పారు. బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళిక ఆధారంగా నిధులు ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 1250 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించామని అన్నారు. 70 వేల కోట్ల అంచనాతో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 7 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. విద్యుత్, ప్రసార పంపణీ నష్టాలను 10.29 శాతం తగ్గించామని, వచ్చే ఏడాది ఈ నష్టాన్ని సింగిల్ డిజిట్ కు తెస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు తీసుకువచ్చామని ఆయన గుర్తుచేశారు. ఏడు ప్రధాన జాతీయ విద్యాసంస్థలను కేంద్రం మంజూరు చేసిందని ఆయన వివరించారు. కేంద్రం మంజూరు చేసిన 5 జాతీయ విద్యా సంస్థలను ఇప్పటికే ప్రారంభించామని ఆయన చెప్పారు.