: ఆ హంతకుడికి 67 లక్షల అప్పుంది: పోలీసులు
మహారాష్ట్రలోని థానేలో ఒకే కుటుంబంలోని 14 మందిని హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డ హస్నెన్ అన్వర్ వరేకర్ కి 67 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు, వ్యాపారం చేస్తానంటూ సన్నిహితులు, బంధువుల నుంచి వరేకర్ అప్పులు తీసుకున్నట్టు గుర్తించారు. హత్యల అనంతరం ఆ నివాసంలో జరిపిన సోదాల్లో పలు మందులు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు. అయితే ఆ మందులు ఎక్కడ కొన్నారు? వాటిని సూచించిన వైద్యుడు ఎవరు? వంటి విషయాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, తల్లిదండ్రులు, అక్కాచెళ్లెళ్లు, భార్య, పిల్లలు, మేనకోడళ్లు, మేనల్లుళ్లు... ఇలా ఆ ఇంట్లోని ఒక్క మహిళ మినహా మిగిలిన 14 మందిని వరేకర్ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర గాయాలపాలై చికిత్సతో బతికి బట్టకట్టింది. ఆమె పిల్లలు, కుటుంబ సభ్యులు హత్యకు గురికావడంతో షాక్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేకపోతోందని పోలీసులు చెప్పారు.