: ఆ పథకాలకు నవ్య నామకరణం... 'రాజీవ్' పేరు తొలగింపు!
కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన ప్రతీ పథకానికి ఇందిర, రాజీవ్ గాంధీ పేర్లు తగిలించడం దేశ ప్రజలకు తెలిసిన విషయమే. సంపూర్ణ ఆధిక్యంతో గద్దెనెక్కిన బీజేపీ మాత్రం ఇప్పుడు పలు ముఖ్యమైన పథకాలకు కొత్త రూపునిచ్చే ప్రయత్నంలో ఉంది. రాజీవ్, ఇందిర పేర్లు తొలగించే పనిలో పడింది. అదే సమయంలో ఆ పథకాలకు బీజేపీ తన ప్రయోజాలను ప్రతిఫలించే పేర్లను మాత్రం తగిలించడం లేదు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ పంచాయత్ సశక్తికరణ్ అభియాన్ పథకం పేరు ఏప్రిల్ 1 నుంచి పంచాయత్ సశక్తికరణ్ అభియాన్ గా మారనుంది. అంటే రాజీవ్ పేరు కనుమరుగు కానుంది. అలాగే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ (వికలాంగ విద్యార్థులకు ఉద్దేశించిన ఫెలోషిప్) పథకంలోనూ... రాజీవ్ పేరు చెరిగిపోయి నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ గా మార్పు చెందనుంది. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ పథకం పేరులోనూ రాజీవ్ పేరు తొలగించనున్నారు. ఇక క్రీడాకారుల ప్రోత్సాహానికి ఉద్దేశించిన రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ పథకం కూడా ఖేలో ఇండియాగా మారనుంది. గతంలోనూ బీజేపీ పలు పథకాల పేర్లలో రాజీవ్ పేర్లు తొలగించిన విషయం తెలిసిందే. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది.