: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హంతకుల అరెస్ట్... కారులో జరిగిన వాగ్వాదంతోనే హత్య
సికింద్రాబాదు పరిధిలో రెండు రోజుల క్రితం నడిరోడ్డుపై జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ హత్యోదంతాన్ని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సంజయ్ ను హత్య చేసిన నలుగురు పాతబస్తీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటికి వస్తున్న క్రమంలో షేరింగ్ కారు ఎక్కిన సంజయ్ అప్పటికే కారులో ఉన్న నలుగురు వ్యక్తులతో గొడవ పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. కారు ఎక్కడానికి ముందే ఫుల్లుగా మద్యం సేవించిన సంజయ్, కారెక్కిన తర్వాత కారులోని వ్యక్తులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన సదరు వ్యక్తులు కారును సికింద్రాబాదు పరిధిలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద ఆపి, సంజయ్ పై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు దుండగులు పారిపోయిన కారును గుర్తించి పట్టేశారు. కారు డ్రైవర్ ను విచారించి మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ నుంచి పాతబస్తీకి వెళ్లేందుకు ఆ యువకులు కారెక్కగా, పంజాగుట్ట సమీపంలో సంజయ్ ఆ కారు ఎక్కినట్లు సమాచారం.