: సిబ్బంది తగ్గింపు ఆర్మీతోనే మొదలు: మనోహర్ పారికర్
భారీగా పెరిగిపోతున్న వేతన వ్యయానికి కత్తెర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం... కీలకమైన భద్రతా విభాగాల్లో సిబ్బంది కుదింపునకు చర్యలు ప్రారంభించింది. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ... వేతన వ్యయాలను కుదించుకుని ఆ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించేందుకు వీలుగా మిలటరీ సిబ్బందిని తగ్గించుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమం ఆర్మీతోనే ప్రారంభమవ్వాలని పారికర్ అన్నారు. సిబ్బందిని కుదించుకోవడానికి గల అవకాశాలను గుర్తించాలని తాను ఇప్పటికే ఆర్మీని ఆదేశించినట్టు చెప్పారు. దీనికి సమయం పడుతుందని, రాత్రికి రాత్రే చేయడం సాధ్యం కాదన్నారు. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా జీతాలు, పింఛన్ల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ... వ్యయం అనివార్యమన్నారు. అయితే, ఆర్మీలో సిబ్బంది తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. అలాగే, శిక్షణలో పరికరాల వినియోగం ద్వారా కూడా వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ప్రభుత్వం ముందున్న ఏడవ వేతన సంఘం సిఫారసులపై రెండు మూడు వారాల్లో పార్లమెంటులో తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. సాయుధ బలగాల నవీకరణ అనేది ప్రభుత్వానికి కీలకమైనదని పేర్కొన్నారు. 21 నెలల మోదీ సర్కారు పాలనలో 1.20 లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులపై ఒప్పందాలు జరిగాయని... వీటిలో 32వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తుది ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయన్నారు.