: నాపై ఎంతైనా దాడి చేసుకోండి.. ఆ నాలుగు ప్రశ్నలకు మాత్రం బదులివ్వండి: రాహుల్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తనపై మాటలతో విరుచుకుపడడంపై... కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అసోంలోని ఇల్చార్ లో స్పందించారు. ‘పార్లమెంట్ లో నేను ప్రధానికి నాలుగు ప్రశ్నలు సంధించాను. వాటికి ప్రధాని బదులివ్వకుండా నా నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్ గాంధీ తదితర మాజీ ప్రధానుల మాటలను ఉటంకించారు’ అని రాహుల్ అన్నారు. ‘నాపై వ్యక్తిగతంగా ఎంతైనా దాడి చేసుకోండి. కానీ, నేను వేసిన ఆ నాలుగు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పండి’ అని రాహుల్ ప్రధానిని డిమాండ్ చేశారు. భారత్ లో తయారీ, నల్లధనం వెలికితీత పథకాలపై రాహుల్ సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీజేపీ మార్కెటింగ్ కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఉందని రాహుల్ అన్నారు. అయితే, ఇదంతా తప్పుడు హామీల ప్రభావమేనన్నారు. బీహార్ వలే అసోంలోనూ ఎన్నికల ప్రచారానికి ప్రధాని వస్తే తాను వేసిన నాలుగు ప్రశ్నలకు సమాధానం కోరాలని ఆయన స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి... 2019లో కేంద్రంలో అధికారం చేపట్టినప్పుడే మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ప్రశాంతంగా ఉన్న హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు.