: కుక్కపిల్లను రక్షించబోతే...మహిళ తిట్టింది!: ఫేస్ బుక్ లో రావెల సుశీల్ వివరణ


మద్యం మత్తులో మహిళకు కారు అడ్డం పెట్టి, ఆమె చేయి పట్టి లాగాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ఎట్టకేలకు వివరణ ఇచ్చాడు. ఈ మేరకు అతడు ఫేస్ బుక్ లోని తన పేజీలో ఘటనకు సంబంధించి నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వివరణను పోస్ట్ చేశాడు. సదరు పోస్ట్ లోని వివరణ ప్రకారం... నిన్న మధ్యాహ్నం రోడ్డుపై వెళుతున్న సుశీల్ కారుకు ఓ కుక్కపిల్ల అడ్డంగా వచ్చింది. రోడ్డు దాటే క్రమంలో ఆ కుక్కపిల్ల రాగా, దానిని గమనించిన సుశీల్ కారు ఆపేశాడు. పెంపుడు జంతువులంటే ప్రాణమిచ్చే సుశీల్ వెనువెంటనే కారు దిగి కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. అయితే అక్కడ ఉన్న బాధిత మహిళ అకారణంగా సుశీల్ పై తిట్ల దండకం అందుకుంది. దీనిని గమనించిన అక్కడి స్థానికులు వారి చుట్టూ మూగారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న మహిళ తనపై అసత్య ఆరోపణలు గుప్పించిందని సుశీల్ ఆరోపించాడు. దీంతో స్థానికులు సుశీల్ ను చితకబాదారు. అయితే ఈ వివాదం ఆ వెంటనే ముగిసింది. బాధిత మహిళతో మాట్లాడి వివాదాన్ని నిన్న మధ్యాహ్నానికే సుశీల్ పరిష్కరించుకున్నాడు. అయినా సాయంత్రం దాకా న్యూస్ చానెళ్లలో దీనిపై అసత్య కథనాలు ప్రచురితమవుతున్నాయని సుశీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కుట్ర కారణంగానే తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, తన రాజకీయ ప్రత్యర్ధులే ఈ వివాదాన్ని ఎగదోశారని సుశీల్ ఆరోపించాడు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని అసత్య వార్తలు ప్రసారం చేయొద్దని సుశీల్ న్యూస్ చానెళ్లకు విజ్ఞప్తి చేశాడు.

  • Loading...

More Telugu News