: టోర్నీలో పాల్గొనాలా? లేక తప్పుకోవాలా? అన్నది పాక్ చేతుల్లోనే ఉంది: రాజీవ్ శుక్లా


భారత్ వేదికగా జరగనున్న టీట్వంటీ సిరీస్ లో పాల్గొనాలా? లేక తప్పుకోవాలా? అన్నది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేతుల్లోనే ఉందని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ధర్మశాల వేదికగా మార్చి 10న నిర్వహించే భారత్, పాక్ మ్యాచ్ కు భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇది సైనికుల మనోభావాలకు సంబంధించిన అంశమని, అందుకే మ్యాచ్ కు భద్రత కల్పించలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ, పాక్ ప్రభుత్వం, పీసీబీ జట్టును టీట్వంటీ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు భారత్ కు పంపాలని నిర్ణయించినప్పటికీ అక్కడి భద్రతా సమస్యలు చక్కబడలేదని ఆరోపించారు. దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ, ప్రపంచ క్రికెట్ జట్ల ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ తీసుకుంటున్న చర్యలను ఆయా బోర్డులకు గతంలోనే వివరించామని చెప్పారు. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ లేదని చెప్పిన ఆయన, బంతి పాకిస్థాన్ చేతిలోనే ఉందని సూచించారు. టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనేది పీసీబీ చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. భద్రతపై ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News