: తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన లాభం!
2016-17 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచి మొదలైన లాభాల పర్వం కొనసాగింది. నాలుగు రోజుల వ్యవధిలో స్టాక్ మార్కెట్లు 7 శాతం వరకూ పెరిగిన సమయంలో లాభాల స్వీకరణ జరుగుతున్నప్పటికీ, అదే స్థాయిలో కొనుగోళ్లు సైతం వెల్లువెత్తిన వేళ, తీవ్ర ఒడిదుడుకుల మధ్య నేటి సెషన్ స్వల్ప లాభాల్లో ముగిసింది. సెషన్ ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సూచికలు, ఆపై కొద్ది సేపటికే నష్టాల్లోకి జారాయి. ఆపై పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 39.49 పాయింట్లు పెరిగి 0.16 శాతం లాభంతో 24,646.48 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 9.75 పాయింట్లు పెరిగి 0.13 శాతం లాభంతో 7,485.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.13 శాతం, స్మాల్ క్యాప్ 0.75 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 29 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, వీఈడీఎల్, ఎస్బీఐఎన్, కోల్ ఇండియా తదితర కంపెనీలు లాభపడగా, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐడియా, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,748 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,521 కంపెనీలు లాభాల్లోను, 1081 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాటి సెషన్ ముగిసే సరికి రూ. 91,59,001 కోట్ల రూపాయల మార్కెట్ కాప్ నమోదైంది.